శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (08:34 IST)

ఇకపై సామాన్యుడిలా జీవితం.. నరసింహన్

ఇకపై సామాన్యుడిలా జీవితం గడుపుతానని తెలంగాణ గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. ఆయన రాజభవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన ఆత్మీక సమ్మేళనంలో పాల్గొన్నారు..

తన తొమ్మిదేళ్ల గవర్నర్  పాత్రపై ఆయన మనసు విప్పి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపంగా సాగుతున్న తరుణంలో ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించకుండా  సంయమనం పాటించాల్సిందిగా పోలీసులను తాను ఆదేశించానని ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ నరసింహన్ వెల్లడించారు.

"ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయి. రాష్ట్ర విభజన సమయంలో నేను తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేశారు. గవర్నర్‌గా ఎంతో నేర్చుకున్నా. కర్ఫ్యూ సమయంలో ఈ గడ్డపై కాలు మోపా. ఉద్యమ సమయంలో పోలీసులు సంయమనం పాటించారు. తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నా.

తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టా. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన అనుకున్నారు. ఒక్క బుల్లెట్‌ కూడా ఉపయోగించొద్దని ఉద్యమ సమయంలో చెప్పా. నేను ఏ పార్టీకి, వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించలేదు.

పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు. ఎప్పుడూ దేవాలయాలను దర్శించడానికి వెళ్తారంటూ నాపై చేసిన ఆరోపణలు బాధించాయి. నేను తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాలకే వెళ్లాను. ప్రతిరోజూ హైదరాబాద్‌లోని ఆలయానికి వెళ్తాను.

నాకు కూడా ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఇకపై సామాన్యుడిలా జీవితం గడుపుతా. చెన్నైలోనే స్థిరపడతా" అని వెల్లడించారు.