ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (19:30 IST)

తెలంగాణలో రాగల 3రోజుల పాటు తేలికపాటి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొన్నారు.

నిన్నటి అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ ఎత్తులో ఈరోజు మధ్య అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ ఈనెల 15న ఉత్తర అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.

తదుపరి ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ తూర్పు-మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పయనిస్తూ ఈనెల 17న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని పేర్కొన్నారు.

ఇది ఈనెల 18న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాన్ని చేరే అవకాశం ఉందన్నారు. నిన్న ఉత్తర తమిళనాడు వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్‌ ఒడిశా మీదుగా సిక్కింలోని గ్యాంగ్‌టక్‌.. పశ్చిమబెంగాల్‌ వరకు సముద్రమట్టానికి  0.9 కి.మీ ఎత్తులో కొనసాగి ఈరోజు బలహీనపడిందని వివరించారు.