శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (18:27 IST)

తెలంగాణాలో మే 7వ వరకు లాక్‌డౌన్ పొడగింపు?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నా ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. 
 
ఇందులో ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌ను కొంతమేర సడలిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణలో లాక్‌డౌన్‌ను సడలించాలా? లేక ఎప్పటిలానే కొనసాగించాలా అనే అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 
 
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత కూడా కొన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో మే 7 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేబినెట్‌ భేటీలో చర్చించినట్లుగా వార్తలొస్తున్నాయి. 
 
అంతేకాదు, హైదరాబాద్‌లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్రంలో డోర్ డెలివరీలు కూడా అనుమతించకూడదని ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో పాటు ఇళ్ల కిరాయిలను మూడు నెలల పాటు వసూలు చేయకుండా ఉండే విధంగా గృహ యజమానులను ఆదేశించే అవకాశం ఉంది.