సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (17:13 IST)

మైనర్‌తో 20 యేళ్ళ యువతి సహజీవనం.. అంతలోనే...

హైదరాబాద్ నగరంలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. 17 యేళ్ళ యువకుడితో 20 యేళ్ళ యువతి వారం రోజులుగా సహజీవనం చేస్తూ వచ్చింది. ఇంతలో ఏమైందో ఏమోగానీ, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 
 
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు పోలీసులు వెల్లడిస్తూ, యూసుఫ్‌గూడలో నివసించే యువకుడు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తూ సినీ పరిశ్రమలో పని చేస్తున్న యువతి (20)తో ప్రేమలో పడ్డాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో జవహార్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తూ వచ్చారు. 
 
వారం రోజుల కిందట గదిలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే రెండు రోజులుగా యువతి, యువకుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి పెద్దదైంది. శనివారం ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 
 
ఇక యువతి చున్నీ ఊడిపోవడంతో కింద పడిపోయింది. ఇప్పటికే యువకుడి మెడకు ఉరి బిగుసుకుంది. ఆమె వెంటనే వెళ్లి చుట్టుపక్కల వారికి సమాచారం అందించి తీసుకువచ్చేసరికి యువకుడు మృతి చెందాడు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి పోలీసు శాఖలో పని చేస్తున్నట్లు సమాచారం.