గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

బోనాలకు భార్య రాలేదని.. భర్త ఆత్మహత్య

బోనాలకు భార్య రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తుక్కుగూడకు చెందిన సాయి కార్తీకి గౌడ్ (33) అనే వ్యక్తి భార్య రవళితో కలిసి ఈ నెల 12వ తేదీన బంధువుల ఇంట్లో జరిగే వివాహం కోసం కందుకూరు మండలం బేగంపేటకు వెళ్లాడు. వివాహం తర్వాత భార్యను అక్కడే వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. 
 
అయితే, శనివారం మీర్‌పేట్‌లో బోనాలు జరిగాయి. ఈ బోనాలు పండుగ చేసుకునేందుకు తన పిన్ని ఇంటికి వెళ్దామని, అందువల్ల తక్షణం రావాలంటూ భార్యకు ఫోన్ చేశాడు.
 
అయితే, ఆమె ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్ గౌడ్... భార్యకు వీడియో కాల్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, భార్య చూస్తుండగానే ఇంటి దూలానికి ఉరివేసుకున్నాడు. ఆ వెంటనే రవళి తమ పక్కింటికి ఫోన్ చేసి తన భర్తను రక్షించాలని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఆమె ఇంటికి చేరుకునే సమయానికి భర్త శవమైపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామాకు పంపించారు.