ఏపీ సీఎం జగన్‌ను కొనియాడిన కోమటిరెడ్డి.. మోటార్లకు మీటర్లు ఉంటే తప్పేంటి?
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌ను కొనియాడారు. మోటార్లకు మీటర్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
అసలు మోటార్లకు మీటర్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మీటర్లు ఉన్నప్పటికీ, చార్జీలు వసూలు చేయడం లేదని ఏపీ సీఎం జగన్ చెప్పారని.. ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.
మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడ అధికారికంగా చెప్పలేదని ఆయన మరోసారి ధృవీకరించారు.
డిస్కౌమ్‌లను కాపాడుకోవడం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
అంతకుముందు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్న విషయంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిలో అన్ని రికార్డులు బద్దలుకొట్టే పాన్ ఇండియా స్టార్‌గా కేసీఆర్‌ని ప్రొజెక్ట్ చేయాలని కోమటి రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్ర సంపదను కేసీఆర్ వంశం ఎలా కొల్లగొట్టిందో.. ఒక అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించిందో భారత ప్రజలు తెలుసుకోనివ్వండంటూ కౌంటర్లు వేశారు. అలాగే.. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.