సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (12:03 IST)

మునుగోడు బరిలో వైఎస్ఆర్టీపీ అభ్యర్థి?

ys sharmila
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల నిర్ణయించారు. ఇందుకోసం ఆమె నలుగురు పేర్లను పరిశీలించారు. వారిలో ఒకరి పేరును అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో తన తండ్రి వైఎస్ఆర్ పాలన ఓట్లు తెచ్చిపెడుతుందని గట్టిగా భావిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ పాలనను గుర్తు చేస్తూ ఓట్లు అడగాలన్న ప్రణాళికతో ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. 
 
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఒక అగ్నిపరీక్షలా మారడంతో ఈ ఎన్నికను ఈ మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 
 
అదేసమయంలో ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని కూడా పోటీకి దింపి తమ సత్తా ఏంటో చాటాలన్న గట్టి పట్టుదలతో వైఎస్ షర్మిల కూడా ఉన్నారు. దీంతో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్న విషయంపై ఇప్పటికే ఆమె కసరత్తు పూర్తి చేసి నలుగురి పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. వీరిలో ఒకరి పేరును ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికారింగా వెల్లడించనున్నారు.