1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (17:22 IST)

ఇంటర్ పరీక్షా విధానంలో మార్పులు.. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్

students
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటర్ బోర్డు పరీక్షల్లో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఇంటర్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ఇంటర్‌లో రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉంటాయి. కానీ, ఇకపై ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ప్రాక్టికల్స్ అమలుపై నిర్ణయం తీసుకున్నారు. 
 
వచ్చే విద్యా సంవత్సరం నుంచి వార్షిక పరీక్షల్లో థియరీకి 80 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. వార్షిక పరీక్షలే కాకుండా, ఇంటర్నల్ పరీక్షలను కూడా ఇదే విధానంలో నిర్వహించనున్నారు. నూతన విధానం ప్రకారం ఇంటర్ ఇంగ్లీష్ సబ్జెక్టులకు ల్యాబ్ వర్క్ తప్పనిసరికానుంది. దీంతో అన్ని కాలేజీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది.