శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (13:44 IST)

అసెంబ్లీ వద్ద రాజశ్యామల, శత చండీ యాగం చేస్తోన్న కేసీఆర్

kcrao
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో రాజశ్యామల, శత చండీ యాగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
సిద్దిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నేటి నుంచి ఐదు రోజుల పాటు యాగం నిర్వహించనున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు యాగం ప్రారంభమైంది. ఈ యాగంలో సీఎం కేసీఆర్ చురుగ్గా పాల్గొన్నారు. 
 
సీఎం కేసీఆర్ తరచూ యాగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో యాగాలు నిర్వహిస్తారు. సతీ సమేతంగా పాల్గొని పూజలు చేస్తారు. 
 
ఇందులో భాగంగానే తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి రాజశ్యామల, శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. 
 
విశాఖ శారద అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో పలువురు పండితులతో ఐదు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా పూజారులు హాజరయ్యారు.
 
శత్రువుల బలాన్ని తగ్గించేందుకు, ప్రజలను మంత్రముగ్ధులను చేసేందుకు శక్తి సిద్ధించేందుకు ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పండితులు చెబుతున్నారు. 
 
ఈ యాగంలో భాగంగా తొలిరోజు అంటే నవంబర్ 1 సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ నిర్వహించి యాగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా ఐదు రోజుల పాటు యాగం కొనసాగనుంది. 
 
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నట్లు సమాచారం.