శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (14:19 IST)

కెసిఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌: రేవంత్‌

కెసిఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారితే.. ఆయన కుమారుడు డ్రగ్స్‌ అమ్మకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిరుద్యోగ గర్జనలు నిర్వహిస్తామని ప్రకటించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్మయుద్ధం ప్రకటిస్తున్నామని అన్నారు.

ఈ 19 నెలలు తెలంగాణ విముక్తి కోసం పోరాడతామని, రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తామని ప్రకటించారు. అరశాతం ఉన్న కులానికి ముఖ్యమంత్రితోపాటు మంత్రి పదవులు ఇచ్చారని, 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కొడుకు, అల్లుడిలో ఎవరో ఒకరిని మార్చి.. ఓ మాదిగ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వగలరా ? అని ప్రశ్నించారు. తన మనవడు తినే సన్నబియ్యమే పేద విద్యార్థులంతా తింటున్నారంటూ చెప్పడం కాదని, తన మనవడు చదివే స్కూల్‌లో పేద పిల్లలను చదివించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులు బలిదానాలు చేసుకున్నది సన్నబియ్యం కోసం, గొర్రెలు, బర్రెల కోసమేనా ? అని అడిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కెసిఆర్‌ మోసం చేశారని, కానీ.. ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి పదవులు వచ్చాయని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా వేలాది మంది ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు.