1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (14:15 IST)

షర్మిల దీక్ష.... జనం లేని పర్యటన

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవి పాడులో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ఆర్టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. అనంతరం పెనుబల్లి మండల కేంద్రంలో షర్మిల ఒకరోజు దీక్షను చేపట్టారు. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు షర్మిల పెనుబల్లి లో దీక్ష చేపట్టారు.

పెనుబల్లి మండలం గంగాదేవి పాడు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఎంఏ ఎకనమిక్స్ చేసి ఉద్యోగం రాకపోవడంతో ఈ నెల 13న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కుటుంబానికి రాజకీయ పార్టీలకు చెందిన వారు పరామర్శలు చేశారు. ఇప్పటికే బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

కాగా షర్మిల ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే షర్మిల పర్యటన సందర్భంగా అధికార పార్టీ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టినట్లుగా స్పష్టమైంది. ఖమ్మం నుంచి బయల్దేరిన షర్మిల తల్లాడాలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తల్లాడ నుంచి గంగాదేవి పాడు గ్రామం వరకు సత్తుపల్లి నియోజకవర్గం అయినప్పటికీ ఎక్కడ కూడా రోడ్ల మీదికి గ్రామస్తులు వచ్చి షర్మిల స్వాగతం అభినందనలు పలుకలేదు.

అంతేకాకుండా గంగాదేవి పాడు గ్రామంలో మృతుడు నాగేశ్వరరావు ఇంటి వద్ద కూడా షర్మిలను చూడటం కోసం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఎవరూ రాలేదు. కేవలం పార్టీ కార్యకర్తలు నాగేశ్వరరావు బంధువులు హడావుడి మాత్రమే కనిపించింది. ఇకపోతే నాగేశ్వరావు సోదరుడు రాము ఇంటిలో లేకుండా పోయాడు. రాము గురించి షర్మిల వెంట వచ్చిన పార్టీ కార్యకర్తలు సెక్యూరిటీ అధికారులు వాకబు చేసినప్పటికీ అతని గురించి మాత్రం చెప్పలేదు.

ఉదయం వరకు ఇంటిలోనే ఉన్నా రాము షర్మిల వచ్చే సమయంలో మాత్రం లేకుండా పోయాడు. చనిపోయిన నాగేశ్వరరావు తండ్రి, తల్లి, సోదరిలను షర్మిల పరామర్శించిన అనంతరం పెనుబల్లి మండల కేంద్రంలో ఒక రోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే ఈ నిరాహార దీక్ష శిబిరం వద్ద కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎవరూ రాలేదు.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని పెనుబల్లిలో ఈ దీక్షా శిబిరం జరిగినప్పటికీ ఇక్కడ జనం రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా సత్తుపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య గత రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో మకాం వేసి షర్మిల పర్యటన విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన వారు ఎవరు కూడా షర్మిలని చూడటానికి సైతం రాలేదని తెలుస్తుంది.