తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదే లే అంటున్న సూర్యుడు
తెలుగు రాష్ట్రాల్లో సూర్యభగవానుడు తగ్గేదే లే అంటున్నారు. సూర్యతాపం దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దీంతో ముందుగానే పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే ఎండ తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల పనివేళలను కుదించింది. అయితే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి.
కొమరం భీమ్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కౌటాలలో 43.7గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీలు, జైనాథ్‌లో 43.8డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్‌లో 43.3ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పని వేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటలుగా విద్యాశాఖ నిర్ణయించింది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగుతోంది.