శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (14:33 IST)

'మహిళలు, శిశు సంక్షేమం, రక్షణ కోసం పనిచేస్తాం' : సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ కొలువుదీరింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆమెతో పాటు కమిషన్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళల రక్షణ, శిశు సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అతివలు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. 
 
మహిళలకు సమానత్వం కల్పించి హక్కులు పరిరక్షించేందుకు కృషి చేస్తామని సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. తమ దృష్టికి వచ్చే కేసులను సుమోటోగా స్వీకరించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని ప్రకటించారు. 
 
కాగా, మహిళా కమిషన్ సభ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్, గద్దల పద్మ బాధ్యతలు స్వీకరించారు. కుమ్ర ఈశ్వరీబాయి, సుదాం లక్ష్మి, ఉమాదేవి యాదవ్, రేవతీరావు సభ్యత్వ బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సునీత 2010 నుంచి 2014 ఏప్రిల్‌ వరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. మహిళా కమిషన్‌ ఈ శాఖ పరిధిలోనిదే. ఇప్పుడు ఆమె ఆ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.