తెలంగాణాలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు 13వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. వీటిని ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,94,616 మంది హాజరవుతున్నారని తెలిపారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, అన్ని పరీక్షలకు పరీక్షా సమయంలో మూడు గంటలు ఇవ్వగా సైన్స్ పరీక్షకు మాత్రం 3.20 గంటలు కేటాయించామని, మొత్తం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు.