శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (17:58 IST)

తెలంగాణ రోడ్లపై 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు

tsrtc bus
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)కొనుగోలు చేసిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు.
 
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కొత్త బస్సులను టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సమక్షంలో మంత్రి ప్రారంభించారు. ఈ 50 బస్సులు మొదటి దశలో TSRTC కొనుగోలు చేయనున్న 776 బస్సులలో భాగమని మంత్రి తెలిపారు.
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 392 కోట్ల విలువైన మొత్తం 1,016 బస్సులను తన ఫ్లీట్‌లో చేర్చాలని కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో తొలివిడతగా TSRTC 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్ బస్సులు, 16 స్లీపర్ బస్సుల కోసం ఆర్డర్ చేసింది. ఈ బస్సులన్నీ మార్చి 2023 నాటికి వివిధ మార్గాల్లో నడుస్తాయని చెప్పారు. 
 
ఈ  లగ్జరీ బస్సుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వుంది. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ప్రయాణికులు పానిక్ బటన్‌ను నొక్కితే TSRTC కంట్రోల్ రూమ్‌కి తెలియజేయబడుతుంది. ఒక్కో బస్సులో 36 వాలుగా ఉండే సీట్లు, ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులు సెల్‌ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాలు, వినోదం కోసం టీవీలు ఉన్నాయి.