నేటితో ముగియనున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. చివరిరోజైన ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చజరగనుంది. ఈనెల 7 నుంచి ప్రారంభమైన సమావేశాల్లో అదే రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 9న బడ్జెట్‌పై సాధారణ చర్చ ఆ తర్వాత నాలుగు రోజుల పాటు పద్దులపై చర్చ జరిగింది. మొత్తం 37 పద్దులు శాసనసభ ఆమోదం పొందాయి.
సమావేశాల చివరిరోజైన నేడు ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చించనున్నారు. శాసనసభ ఆమోదించిన ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ కమిటీల చట్ట సవరణల బిల్లులపై మండలిలో చర్చ జరగనుంది. ఉభయ సభల్లో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. 2020 మార్చితో ముగిసిన సంవత్సరానికి కాగ్ నివేదికలను శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.