సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (14:12 IST)

ద‌ళిత బంధు ప‌థ‌కానికి రూ.17,700 కోట్లు.. ఎలా అప్లై చేసుకోవాలి?

ద‌ళిత బంధు ప‌థ‌కానికి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధుల‌ను భారీగా పెంచినట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
 
దళిత బంధు కోసం గ‌త వార్షిక బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్ల‌ను కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి ఈ మొత్తాన్ని పెంచింది. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌  నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం  ఇప్పటికే అమలు చేస్తోంది. 
 
దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్ధిక సాయం అందిస్తోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా  రెండు లక్షల మందికి దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇకపోతే.. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మక దళిత బంధు పథకానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు  శ్రీకారం చుట్టింది. దళిత బంధు పథకం ద్వారా దళితులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు వేదికల ద్వారా వెల్లడించారు. 
 
ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 10 లక్షలు జమ చేసేలా విధివిధానాలు రూపొందించారు. అయితే వీటిని లబ్ధిదారుల పెట్టబోయే యూనిట్లకు మాత్రమే వెచ్చించేలా షరతులు విధించారు.
 
దళిత బంధు స్కీంకి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దళిత బంధు పథకాన్ని 2014 నాటి కుటుంబ సమగ్ర సర్వేలోని వివరాల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం తిరిగి సర్వే చేసి లబ్ధిదారులను గుర్తిస్తుంది. గ్రామ స్థాయిలో ఈ సర్వే జరిపాక లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శిస్తారు. గ్రామ సభ దీనిని ఆమోదిస్తుంది.
 
ఒకవేళ సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారు, కొత్త వారు ఎవరైనా ఉంటే వారికీ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. అందువల్ల లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కనివారు పంచాయతీ కార్యదర్శిని, గ్రామ సర్పంచిని, వార్డు సభ్యులను సంప్రదించాలి.
 
దళిత బంధు ద్వారా ఇచ్చే రూ. 10 లక్షలతో వ్యాపారం చేసేందుకు దాదాపు 30కి పైగా వ్యాపార ఆలోచనలను గుర్తించారు. ఆయా యూనిట్ల ఏర్పాటుకు మాత్రమే ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. దళిత బంధు ద్వారా చేసే వ్యాపారాలకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుంది. 
 
దళిత బంధు ద్వారా చేసే వ్యాపారాలపై ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ ఉంటుంది. అలాగే వీటికి సాయంగా ప్రభుత్వ యాప్ కూడా రూపుదిద్దుకుంది. దీని ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఆయా వ్యాపారాల్లో తగిన సూచనలు జారీచేస్తారు.
 
లబ్ధిదారుడు చనిపోతే దళిత రక్షణ నిధి ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తారు. ఆయా యూనిట్లు కొనసాగేలా ప్రభుత్వం తగిన చేయూత ఇస్తుంది.