బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (09:21 IST)

లాక్డౌన్ వేస్ట్.. నేను చెప్పినట్టు నడుచుకుంటే బతుకుతారు.. కేసీఆర్

కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ రాష్ట్రంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మృత్యువాతపడుతున్నారు. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించాలంటూ చాలా మంది సలహాలు ఇస్తున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఆలోచనే లేదు.. అలా చేస్తే గొంతు పిసికినట్లే అంటూ వ్యాఖ్యానించారు. పైగా, ప్రజలు తాను చెప్పినట్టు నడుచుకుంటే ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
 
ప్రగతి భవన్‌లో కరోనా పరిస్థితులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లాక్డౌన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. 
 
'రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా వలస కార్మికులున్నారు. మొదటివేవ్‌లో లాక్డౌన్‌తో వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని మనం చూశాం. ఇప్పుడు లాక్డౌన్‌ పెడితే.. వీరంతా తమ రాష్ట్రాలకు వెళ్తే.. తిరిగి రావడం కష్టమే. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పుష్కలంగా ఉంది. 6,144 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండిపోయింది. ధాన్యం సేకరణ ఆషామాషీ కాదు. ఒక చైన్‌ వ్యవస్థ ఇమిడి ఉన్న ప్రక్రియ.
 
నిత్యావసరాల సరఫరా, పాలు, కూరగాయలు, పండ్లు, అత్యవసర వైద్య సేవలు, ప్రసవాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆపలేం. ఆక్సిజన్‌ సరఫరా అత్యంత కీలకం. లాక్డౌన్‌ విధిస్తే.. వీటన్నింటికీ ఆటంకాలేర్పడుతాయి. ఒక భయానక పరిస్థితి సృష్టించినట్లవుతుంది. అందుకే.. లాక్డౌన్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదు అని స్పష్టం చేశారు. 
 
అలాగని కరోనా వ్యాప్తిని అడ్డుకోకుండా ఉండలేమని సీఎం అన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మైక్రో కంటైన్‌మెంట్లుగా ప్రకటిస్తామని చెప్పారు. లాక్డౌన్‌తో పరిశ్రమలు మూతబడి ఉత్పాదకత ఆగిపోతుందని, అంతా ఆగమాగం అవుతుందని, క్యాబ్‌డ్రైవర్లు, ఆటోరిక్షా వాలాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తితే.. మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే ప్రమాదముందన్నారు.
 
అయితే, ఈ వైరస్ కట్టడి కోసం ప్రజలు తమ వంతుగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు. ఇందుకోసం తాను చేసే సూచనలు పాటించాలని కోరారు. "ఈ నెల 15 తర్వాత సెకండ్‌వేవ్‌ తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రజలు అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. మన జాగ్రత్తలే శ్రీరామరక్ష అనే విషయాన్ని మరిచిపోవొద్దన్నారు. 
 
పెళ్లిళ్లలో వందకు మించి జమ కావొద్దు. పరిశుభ్రతను పాటించాలి. శానిటైజర్లు, మాస్కులను వాడాలి. భౌతిక దూరాన్ని మరవొద్దు. ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందొద్దు. ముందస్తుగా.. ప్రభుత్వం అందజేసే కొవిడ్‌ కిట్లను వినియోగించుకోవాలి. ఆ కిట్లను ఇంటింటికీ అందజేస్తామన్నారు.