లాక్‌డౌన్ పొడగింపునకే సీఎం కేసీఆర్ మొగ్గు
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యిని దాటిపోయాయి. ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రతి రోజూ కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్యలో ఏలాంటి తగ్గుదల కనిపించడం లేదు. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటగా, 316 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మరణించారు. ఆదివారం నాడు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి.
అయితే, గత రెండు రోజులుగా తెలంగాణాలో మాత్రం పదిలోపు మాత్రమే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది ఒకింత శుభపరిణామమే అయినప్పటికీ... ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్ పొడగింపునకే మొగ్గుచూపుతోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న రెండో దశ లాక్‌డౌన్ వచ్చే నెల మూడో తేదీతో ముగియనంది. ఈ నేపథ్యంలో మే 7వ తేదీ తర్వాత మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్‌లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు.
అదేసమయంలో తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రధానితో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది.
ఇక కేసుల సంఖ్య అధికంగా ఉన్న రాజధాని నగరంపై మరింత దృష్టిని సారించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని సూచించారు.