సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (10:36 IST)

తెలంగాణాలో "డిజిలాకర్‌" సిస్టమ్... నిర్బంధ అమలుకు ఆదేశాలు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుది. రాష్ట్రంలో 'డిజిలాకర్' వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. నిజానికి ఈ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం గత 2015లో అమల్లోకి తెచ్చింది. ఇపుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయనుంది. ఇందుకోసం కేంద్రం అమల్లోకి తెచ్చిన డిజిలాకర్‌ను రాష్ట్రానికి అన్వయింపజేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఇకపై, అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే అంబేడ్కర్‌ ఓపెన్‌వర్సిటీ విద్యార్థుల మార్కుల మెమో లు, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో పొందుపర్చింది. 
 
ఈ డిజిలాకర్‌ను ఎలా ఉపయోగిస్తారంటే.. ఒక విద్యార్థికి అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ నుంచి మార్కుల మెమో కావాలనుకుంటే.. డిజిలాకర్‌ నుంచి పొందవచ్చు. తమ విద్యార్థుల హాల్‌టికెట్‌ నెంబర్ల ఆధారంగా వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లన్నింటినీ డిజిలాకర్‌కు పుష్‌ చేసి పెడుతుంది. 
 
విద్యార్థి తన ఆధార్‌, ఫోన్‌ నెంబర్ల వంటి యూనిక్‌ నెంబర్లతో డిజిలాకర్‌లో అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవాలి. హాల్‌టికెట్‌ నెంబర్‌ ఆధారంగా వర్సిటీ రికార్డుల్లోని ఒరిజనల్‌ సర్టిఫికెట్లను సదరు విద్యార్థి అకౌంట్‌లోకి పుల్‌ చేసుకోవాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒరిజినల్‌ కాపీల ప్రింట్లు తీసుకోవచ్చు. 
 
అలాగే, జీహెచ్‌ఎంసీ జారీ చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా ఇకనుంచి డిజిలాకర్‌లోకి పుష్‌ చేస్తారు. మీ-సేవా కేంద్రాలు అందిస్తున్న టాప్‌ టెన్‌ సర్వీసులకు సంబంధించిన సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు కూడా డిజిలాకర్‌లో పెట్టనున్నారు. 
 
ముఖ్యంగా కులం, ఆదాయం, నివాస సర్టిఫికెట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. మిగతా వర్సిటీలు, విద్యా సంస్థలు కూడా తమ విద్యార్థుల మెమోలను డిజీలాకర్‌లో ఉంచుతాయి. స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్టర్‌ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లను కూడా డిజిలాకర్‌లో పెడతారు.