మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (10:55 IST)

తెలంగాణాలో లాక్డౌన్ ఎత్తివేత : నల్గొండలో మాత్రం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పగటిపూట లాక్డౌన్ ఎత్తివేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్డౌన్‌ సడలింపునిచ్చింది. ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట వెసులుబాటును కల్పించింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల మధ్య కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. 
 
ఈమేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు లాక్డౌన్‌ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. అయితే కరోనా తీవ్రత ఇంకా తగ్గని ఏడు నియోజకవర్గాల్లో పాత నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
 
మరోవైపు, నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మినహా నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో యధావిధిగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే లాక్డౌన్ మినహాయింపు ఉంది. 
 
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో గతంలో మాదిరిగానే లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా లాక్‌డౌన్‌ యధావిధిగా కొనసాగనుంది.