సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (18:43 IST)

హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్డౌన్ : పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో కరోనా వైరస్ కేసులు పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్డౌన్ అమలు చేసే దిశగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనగా ఉందని వార్తలు వస్తున్నాయి. 
 
రాష్ట్రంలో కరోనా కేసులో ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగ్యనగరిలో మళ్లీ లాక్డౌన్ అమలు చేసే అంశంపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించే అంశంపై తుది నిర్ణయం మాత్రం త్వరలో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 15 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
పోలీస్ అకాడెమీలో కరోనా కలకలం
ఇదిలావుండగా, కరోనా మహమ్మారి హైదరాబాదులోని పోలీస్ అకాడమీలో కూడా బీభత్సం సృష్టిస్తోంది. అకాడమీలోని 180 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 100 మంది ట్రైనీ ఎస్సైలు కాగా, మరో 80 మంది అకాడమీ సిబ్బంది. 
 
ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవు. దాంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అకాడమీలోనే క్వారంటైన్ ఏర్పాటు చేసినట్టు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ వెల్లడించారు.
 
ప్రస్తుతం ఈ అకాడమీలో 1100 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 600 మందికి పైగా కానిస్టేబుళ్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక శిక్షణ ఇచ్చే సిబ్బంది, పాలనాపరమైన సిబ్బందితో కలిపి మొత్తం 2,200 మంది వరకు ఉంటారు. 
 
ఈ నేపథ్యంలో, మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అకాడమీలో భారీ ఎత్తున కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.