శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (15:06 IST)

జూలై 5 తర్వాత లాక్డౌన్ - కర్నాటకలో ప్రతి ఆదివారం దిగ్బంధం!

జూలై ఐదే తేదీ తర్వాత లాక్డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. ఇందులోభాగంగా, ఇకపై ప్రతి ఆదివారం దిగ్బంధం అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. 
 
గత కొన్ని రోజులుగా కర్నాటకలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో మరోసారి కట్టుదిట్టమైన లాక్డౌన్‌ నిబంధనల్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పదో తరగతి పరీక్షలు ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిసింది. 
 
జూలై 5వ తేదీన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ముగియగానే.. కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశంలో చర్చించారు.
 
కేసులు పెరుగుతున్న క్రమంలో వారంతపు సెలవుల్లో సంపూర్ణ లాక్డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్‌ ఉంటుందని చెప్పారు. 
 
అయితే జూలై 5వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. వారంలో ఐదురోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఆదివారం అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్‌ అని ప్రకటించారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, బస్సులతో పాటు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు.