కీచక న్యాయవాది... టెన్త్ చదివే కుమార్తె శీలాన్ని దోచుకున్నాడు...
అతను పవిత్రమైన న్యాయవాదవృత్తిలో కొనసాగుతున్నారు. కానీ, అతనిలో మాత్రం ఓ కామ మృగం దాగివుంది. ఈ విషయాన్ని కట్టుకున్న భార్య గుర్తించలేకపోయింది. అదే తన కుమార్తె పాలిట శాపమైంది. ఆ మృగమే తన కుమార్తె శీలంపై కాటేసింది. పవిత్రమైన న్యాయవాదవృత్తిలో ఉండే కన్నతండ్రే కుమార్తె శీలాన్ని దోచుకున్నాడు. ఈ లైంగికదాడిని జీర్ణించుకోలేని ఆ బాలిక... ఆత్మహత్యకు యత్నించింది. దీన్ని గమనించి తల్లి.. కుమార్తెను రక్షించి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా హైదర్‌కోట్, కపిల నగర్ కాలనీలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కపిల నగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తి వరంగల్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు వివాహమై, భార్య మంజులతో పాటు.. పదో తరగతి చదివే కుమార్తె కూడా ఉంది. అయితే, ఈ కామాంధుడు భార్య ఇంట్లో లేనిసమయంలో కుమార్తెను బెదిరించి లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడటంతో ఆ బాలిక లోలోన కుమిలిపోయింది. ఇక జీవించడం వృధా అనుకుని.. ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. ఇది గమనించిన తల్లి మంజుల కూతుర్ని గట్టిగా నిలదీసింది. దీంతో కన్న తండ్రి చేస్తున్న నీచమైన పనులను తల్లికి చెప్పింది. మంజుల దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.