బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (09:04 IST)

కేసీఆర్‌కు వ్యతిరేకంగా ట్వీట్... కండక్టర్ సస్పెండ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు కండక్టర్‌ సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు కండక్టర్‌ సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్‌ ఉత్తర్వులను అందజేసింది. అయితే సంజీవ్‌ సస్పెండ్‌ పట్ల కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 
 
నిజామాబాద్‌కు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ సంజీవ్‌ ప్రభుత్వ పథకాలపైనా, సీఎం కేసీఆర్‌ మీద వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు... నెల రోజుల పాటు విజిలెన్స్‌ విచారణ జరిపిన అనంతరం అక్టోబర్ 30న సంజీవ్‌కు సస్పెన్షన్‌ ఆర్డర్‌ జారీ చేశారు. 
 
దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇది వాక్‌‌స్వాతంత్ర్యాన్ని తుంగలో తొక్కే చర్య అన్నారు. తాను కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు, ఇబ్బందుల గురించి పోస్ట్ చేశానే తప్ప ఎవరినీ విమర్శించి పోస్టులు పెట్టలేదని వాపోతున్నాడు. అలాగే, కార్మిక సంఘాల నేతలు కూడా ఆర్టీసీ యాజమాన్య చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. 
 
సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం నేరమని భావిస్తే అది వాక్‌‌స్వాతంత్ర్యాన్ని తుంగలో తొక్కడమే అని ఆరోపిస్తున్నారు. కార్మికులను ఉన్నఫళంగా సస్పెండ్‌ చేస్తే ఊరుకునేది లేదంటున్నారు. సస్పెన్షన్‌ను ఆర్టీసీ యాజమాన్యం వెనక్కి తీసుకునేవరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.