1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (11:34 IST)

ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కారు కసరత్తు

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కారుపై కసరత్తు చేస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులకు త్వరలో కొంత ఉపశమనం కలుగనుంది. 
 
దీనికి సంబంధించి ఫిబ్రవరి 21న మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ సబ్‌ కమిటీ సమావేశం కానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా సబ్‌కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తుంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో ఫీజు నియంత్రణపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
ఫీజు నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేసేందుకు, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నిబంధనలపై విద్యాశాఖ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. 
 
ప్రస్తుతం నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేకించి పాఠశాలలు ట్యూషన్ ఫీజు పేరుతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నాయి. 
 
వాస్తవానికి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీజును 30 శాతం నుండి 40 శాతం పెంచుతున్నాయి.