శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (16:12 IST)

మేడారం జాతరలో ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ గడ్డపై జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకునే మెడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా మేడారంకు చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
ఇదిలావుంటే, మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గురువారం రాత్రి 9.19 గంటలకు గద్దెపైకి చేరింది. తల్లి రాక వేళ మేడారం శిగమూగింది. కోళ్లు, మేకలు తలలు తెంచుకొని రక్తతర్పణం చేశాయి. 
 
సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరడంతో నిండుపున్నమి, పండు వెన్నెల మధ్య జాతర పరిపూర్ణంగా మారింది. వనదేవతల కొలువుతో గద్దెలు వేయి వెలుగుల కాంతితో తళుకులీనుతున్నాయి. భక్తులపై తల్లులు వర్షిస్తున్న ఆశీస్సులతో గద్దెలు దివ్యక్షేత్రంగా భాసిల్లుతున్నాయి. 
 
మేడారం ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతోంది. వేయికళ్లుకూడా చాలవన్న చందగా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సమ్మక్క రాకతో యావత్‌ మేడారం శిగాలూగింది. మహాజాతర పతాకస్థాయికి చేరుకుంది.