బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (12:28 IST)

తమ బిడ్డకు కేటీఆర్ పేరు పెట్టుకున్న టీఆరెస్ దంపతులు

విడిపోయిన తమను తిరిగి నిలిపిన టిఆర్ఎస్ పార్టీ రుణాన్ని తమ సంతానానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు పెట్టుకొని తీర్చుకున్నది ఒక జంట. వివరాల్లోకి వెళితే...

రామడుగు మండలం ఎంపిపి కలికేటి కవిత , లక్ష్మణ్ దంపతులది ఒక ఆసక్తికరమైన  స్టోరీ. వీరికి ఎనిమిదేండ్ల క్రితం  వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి, అవి చిలికి చిలికి గాలి వానగామారి వారి వివాహ బంధానికి చిచ్చుపెట్టే స్థాయి చేరుకున్నాయి.

తాము ఇక కలిసి ఉండలేమని, విడాకులే శరణ్యమని ఆ దంపతులు ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు కూడా, ఈ నేపధ్యంలో రెండేళ్ల క్రితం వచ్చిన ఎంపిటిసి ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో రామడుగు మండలం ఎంపిటిసి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది.

కాగా మండలంలో టిఆర్ఎస్ పార్టీ  నాయకుడుగా ఉన్న కలికేటి లక్ష్మణ్ టికెట్ కోసం ఆశించారు. తమ తల్లి కి  ఎంపిటిసి టికెట్  ఇవ్వాలని  స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను కోరారు.  దానికి ఎమ్మెల్యే తిరస్కరించి విడిపోయిన  భార్యతో కలిసి ఉంటేనే నీకు టికెట్ ఇస్తానని షరతు విధించాడు.

ఎమ్మెల్యే షరతు రుచించకున్నా రాజకీయాల మీద మక్కువతో లక్ష్మణ్ తలొగ్గాల్సి వచ్చింది. విడిపోదామనుకున్న తన భార్యతో ఎమ్మెల్యే ద్వారా తిరిగి సంప్రదింపులు జరిపారు. ఇద్దరిని కౌన్సిలింగ్ జరిపి విడిపోదామనుకున్న జంటను ఎమ్మెల్యే కలిపారు.

ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణ్ భార్య కవితకు ఎంపిటిసిగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆమెను రామడుగు మండలం ఎంపిపిగా చేశారు. అప్పటి నుంచి అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడిపారు. వారికి ఇటీవలే కుమారుడు జన్మించారు.

తమను తిరిగి కలిపింది పార్టియే కాబట్టి, పార్టీకి తమ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచించిన ఆ జంట, తమ కొడుక్కు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేరు పెట్టుకొని పార్టీ రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి పార్టీ అధినేత చేతుల మీదుగా నామకరణం చేయించుకోవాలని, గత రెండు నెలలుగా ఎదురుచూశారు.

కరీంనగర్ కు వచ్చిన సిఎం కెసిఆర్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  కలిసి అదే విషయాన్ని అభ్యర్థించారు. వారి కోరికను మన్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సంతానానికి "కెటిఆర్" అని నామకరణం చేశారు.