మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (17:49 IST)

కాంగ్రెస్‌లోకి టీఆర్‌ఎస్‌ కీలక నేత

టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగలు తారస్థాయికి చేరాయి. ఫిర్జాదిగూడ మేయర్‌ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోవడంతో టీఆర్‌ఎస్ సీనియర్‌ నేత దర్గా దయాకర్‌రెడ్డి అలకచెందారు. దీన్ని అదునుగా చేసుకుని కాంగ్రెస్ పావులు కదిపింది.

కాంగ్రెస్‌లో చేరాలంటూ దయాకర్‌ ఇంటికి వెళ్లి.. కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. రేవంత్ ప్రతిపాదనకు దయాకర్‌రెడ్డి అంగీకారం తెలిపి... కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆయన బాటలో మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. దయాకర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ కార్యదర్శిగా పనిచేశారు.

ఆయన మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. 2014లో మేడ్చల్ నుంచి సుధీర్‌రెడ్డి గెలిచారు. అయితే మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. అయితే 2019 ఎన్నికల్లో సుధీర్‌రెడ్డిని కాదని మల్లారెడ్డికి టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది.

ఈ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలచి మంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచి మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇటీవల జవహర్‌నగర్‌లో నిర్వహించిన సభలో మంత్రి హరీష్‌రావు సమక్షంలోనే ఇద్దరు నేతలు వాదులాడుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సుధీర్‌రెడ్డికి చెక్ పెట్టాలని మల్లారెడ్డి భావించినట్లు ఉన్నారు. అందులోభాగంగానే దయాకర్‌రెడ్డిని మల్లారెడ్డి దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఫిర్జాదిగూడ టీఆర్ఎస్ మేయర్‌ అభ్యర్థిగా జక్కా వెంకట్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోందనే ప్రచారం జరుగుతోంది.