1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (16:46 IST)

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం : మంత్రి కేటీఆర్

తెలంగాణా రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి వంటి నేత కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టకరమని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన శనివారం జరిగిన సభలో పాల్గొని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 
 
హైదరాబాద్ నగరానికి కేంద్రం ఇప్పటివరకు వరద సాయం అందించలేదన్నారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మనసు రావడం లేదన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. 
 
ఇదేసమయంలో కంటోన్మెంటో అధికారులపై ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వాల్లు రోడ్లు బంద్ చేస్తే తాము కరెంట్, నీళ్లు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 
 
కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తానని చెప్పారు. ఒకవేళ వాళ్లు మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.