తెరాస ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి : 27న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్లీనరీ సమావేశం కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ముఖ్యంగా, ప్లీనరీ జరుగనున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ప్లీనరీ జరుగనున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్.ఐ.సి.సి) పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అధికంగా ఉండనున్నాయి. ముఖ్యంగా, కొత్తగూడ, హైటెక్స్‌తో పాటు సైబర్ టవర్స్, ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొత్తగూడ ప్రాంతాల్లోని ఆఫీసుల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని పోలీసు అధికారులు సూచించారు.
ముఖ్యంగా బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అలాగే సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని వివరించారు. నీరూస్ జంక్షన్ - సైబర్ టవర్స్, జంక్షన్-మెటల్ చార్మినార్ జంక్షన్ - గూగుల్(సీఐఐ) జంక్షన్ - కొత్తగూడ జంక్షన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. మెటల్ చార్మినార్ జంక్షన్-ఖానామెట్ జంక్షన్-హైటెక్స్/హెఐసీసీ/ఎన్‌ఏసీ రోడ్డు వద్ద కూడా ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.
జేఎన్‌టీయూ-సైబర్ టవర్స్-బయో డైవర్సిటీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. గచ్చిబౌలి జంక్షన్-బొటానికల్ గార్డెన్ జంక్షన్- కొత్తగూడ జంక్షన్ - కొండాపూర్ జంక్షన్ల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలుగా నీరూస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లే వారు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి దుర్గం చెరువు, ఇనార్బిట్ - ఐటీసీ కోహినూర్ - ఐకియా - బయోడైవర్సిటీ - గచ్చిబౌలి మీదుగా సైబర్ టవర్స్ వైపునకు వెళ్లకూడదు.
మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్ ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలు అలాగే, హైటెక్ సిటీ - సైబర్ టవర్స్ - జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు రోల్లింగ్ హిల్స్ ఏఐజీ ఆసుపత్రి - ఐకియా - ఇనార్బిట్ - దుర్గం చెరువు రోడ్డు మీదుగా దారి మళ్లించి వెళ్లాలి. అలాగే, ఆర్‌సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్ - నల్లగండ్ల - హెచ్‌సీయూ - ట్రిపుల్ ఐటీ - గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్, ఆల్విన్ రోడ్డు వైపునకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.