శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్ష రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ

tspsc logo
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలోని కమిషన్ సభ్యులు, కార్యదర్శి సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. 
 
కాగా, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 833 సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపుగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా 55 వేల మంది రాశారు. అయితే, ఈ నెల 11వ తేదీన ఏఈ, టీపీబీవో ప్రశ్నపత్రాలను టీఎస్ పీఎస్సీలో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్‌లు కంప్యూటర్ నుంచి పెన్ డ్రైవ్‌ ద్వారా చోరీ చేసినట్టు గుర్తించారు. 
 
దీనిపై టీఎస్ పీఎస్సీ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇలా చోరీ చేసిన ప్రశ్నపత్రాన్ని గురుకుల పాఠాశాల ఉపాధ్యాయిని రేణుక సహాయంతో అభ్యర్థులకు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే సస్పెన్స్‌కు తెరదించుతూ పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. మళ్లీ ఎపుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.