బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:45 IST)

తెలంగాణకి మరో రెండు భారీ పెట్టుబడులు

హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మరో రెండు ప్రముఖ ఫార్మా కంపెనీల గ్రాన్యూల్స్ ఇండియా మరియు లారస్ ల్యాబ్స్ తమ పెట్టుబడులను ఈరోజు ప్రకటించాయి. ఈ రెండు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ లో తమ తయారీ యూనిట్లను నెలకొన్నాయి. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన గ్రాన్యూల్స్ ఇండియా ఈరోజు 400 కోట్ల రూపాయల పెట్టుబడిని తన తయారీ యూనిట్ కోసం తెలంగాణలో పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో 10 బిలియన్ ఫినిష్డ్ డోసులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ పెట్టుబడి ద్వారా సుమారు 16 వందల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. గ్రాన్యూల్స్ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాలు తయారీ యూనిట్లను కలిగి ఉంది. మొత్తం 75 దేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్ యూనిట్ ని హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న గాగిల్లాపూర్ వద్ద కలిగి ఉన్నది.

తమ కంపెనీకి సంబంధించిన పెట్టుబడిని అధికారికంగా ప్రకటించేందుకు కంపెనీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ఈ రోజు ప్రగతిభవన్లో మంత్రికి తారకరామారావును కలిశారు.
  
ప్రముఖ ఫార్మాస్యూటికల్ తయారీ కంపెనీ లారస్ ల్యాబ్స్ ఈరోజు 300 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రకటనను మంత్రి కేటీఆర్ ను కలిసిన తర్వాత చేసింది. ఆ సంస్థ సీఈఓ సత్యనారాయణ చావ ఈరోజు మంత్రి కేటీఆర్ ని ప్రగతిభవన్లో కలిశారు.

తమ సంస్థ హైదరాబాదులో చేయనున్న 300 కోట్ల రూపాయల పెట్టుబడి, రెండు దఫాలుగా ఉంటుందని సంస్థ సీఈవో, మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. 5  బిలియన్ డోసుల కెపాసిటీ కలిగిన ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ కోసం ఈ పెట్టుబడి ఉంటుందని తెలిపింది.  
 
ఇప్పటికే లారస్ ల్యాబ్ కి జీనోమ్ వ్యాలీ లోని ఐకేపీ నాలేడ్జ్ పార్క్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. సంస్థకు ఉన్న ఆరు ఇతర మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అనుమతులు పొంది ఉన్నాయి. లారస్ ల్యాబ్స్  యాంటీ రిట్రోవైరల్, ఆంకాలజీ, కార్డియోవాస్క్యులర్,యాంటీ డయాబెటిక్స్, యాంటీ ఆస్తమా మరియు గ్యాస్ట్రోఎంట్రాలజీ కి సంబంధించిన ఏపీఐలను తయారు చేస్తుంది. 
 
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన లారస్ ల్యాబ్స్ మరియు గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలను మంత్రి కే.తారకరామారావు స్వాగతించారు. రెండు కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రానికి అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు కొనసాగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నాయకత్వంలో అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు కలిగి ఉండడమెనని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ విధానాల వలన ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు ఇతర రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, ఈ రోజు తెలంగాణకు రానున్న ఈ రెండు పెట్టుబడుల ద్వారా తయారీ రంగంలో పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.