1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (16:50 IST)

చరిత్రలో కలుస్తున్న 135 ఏండ్ల సెంట్రల్ జైలు

హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న సచివాలయం నేలమట్టమైంది. ఇప్పుడు అదేబాటలో తెలంగాణ రాష్ట్రంలో మరో చరిత్రాత్మక కట్టడం కనుమరుగు కానుంది. 35 ఏళ్ల కాలం నాటి వరంగల్ ప్రాంతీయ కారాగారం కథ ముగిసిపోతోంది. సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ సర్కార్ చకాచకా అడుగులు వేస్తోంది. 
 
సర్కార్ ఆదేశాలతో జైలును అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బంది ఖైదీలను తరలించే పని మొదలుపెట్టారు. మంగళవారం తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. అందులో 80 మంది పురుషులు 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
 
జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు. జైలులో వెయ్యి మంది ఉండేలా ఏర్పాట్లు ఉండగా, ప్రస్తుతం 27 బ్యారక్​లలో 956 మంది జైలులో ఉన్నారు. బ్యారక్‌లే కాకుండా అధికారులకు, సిబ్బందికి వసతి గృహాలు కూడా లోపలే నిర్మించారు. 
 
ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు 70 పడకల ఆస్పత్రి కూడా ఉంది. వరంగల్ కేంద్ర కారాగారంలోని ఖైదీలను హైదరాబాద్​లోని చర్లపల్లి, చంచల్​గూడాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.