మాలో ఎలాంటి విభేదాలు లేవు: రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ నేతలకు, తనకు మధ్య వివాదాలు నెలకొన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని, తమను వేరు వేరుగా చూడొద్దని ఎంపీ అన్నారు. తమ నాయకులు చేసే పాదయాత్రలకు తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు.
త్వరలోనే తెలంగాణలోని ప్రతీ పల్లెను, గుండెను, గూడెంను చుట్టేయనున్నట్లు చెప్పారు. తన దగ్గర వ్యూహం, ఎత్తుగడ ఉందని తెలిపారు. అధిష్టానం అనుమతి తీసుకుంటానని, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని తెలిపారు. పాదయాత్రలో తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞుడిగా ఉంటానని అన్నారు. చాలా మంది ప్రజలను కలువలేక పోయాను.. క్షమించాలని కోరారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాటకాలకు సురభి నాటకాల్లో ఆస్కార్ అవార్డ్ వచ్చేదని యెద్దేవా చేశారు. కేసీఆర్ బ్యాంక్‌లో వేస్తున్న సొమ్ము అప్పు మిత్తికే కట్ అవుతోందని అన్నారు. రైతుకు పెట్టుబడికి ఉపయోగపడటం లేదని వ్యాఖ్యానించారు.
ఫార్మసీటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కందుకూరు, కడ్తల్‌లో ఫార్మసిటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల మీదపెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఫార్మసిటీ భూ నిర్వాసితులకు కేసీఆర్ ఫామ్ హౌజ్ భూమిని ఇవ్వాలన్నారు. కేసీఆర్ తన భూమిని రైతుల కోసం త్యాగం చేయాలని పట్టుబట్టారు. ఎకరానికి 25 లక్షల చొప్పున తాను ఇప్పిస్తానని..తాను రాబోయే మూడేళ్లు రైతుల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.