శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (11:17 IST)

తెలంగాణకు ఇవాంకా ట్రంప్... బాయ్‌కాట్ చేసిన 'పద్మావతి' దీపికా పదుకునె

తెలంగాణకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రావడమేమిటి... ఆమె సమావేశానికి పిలిచినా రాకుండా పద్మావతి దీపికా పదుకునె ఎగ్గొట్టడమేమిటి అనేకదా మీ ప్రశ్న. అదేనండీ... పద్మావతి చిత్రంపై ఉత్తరాది రాష్ట

తెలంగాణకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రావడమేమిటి... ఆమె సమావేశానికి పిలిచినా రాకుండా పద్మావతి దీపికా పదుకునె ఎగ్గొట్టడమేమిటి అనేకదా మీ ప్రశ్న. అదేనండీ... పద్మావతి చిత్రంపై ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఇవాంకా ట్రంప్ తెలంగాణకు ఈ నెల 28న వస్తున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఎంట్రిప్రిన్యుయర్‌షిప్ సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వస్తున్నారు.
 
ఇదే కార్యక్రమంలో దీపికా పదుకునె పాల్గొనాల్సి వుంది. హాలీవుడ్ టు నోలీవుడ్ టు బాలీవుడ్ అనే అంశం పైన ఆమె మాట్లాడాల్సి వుంది. కానీ ఇందుకు దీపికా పదుకునె నిరాకరించినట్లు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. దీపికా పదుకునె తొలుత ఈ కార్యక్రమానికి వచ్చేందుకు అంగీకరించారనీ, కానీ ఇటీవల పద్మావతి చిత్రంపై తలెత్తిన వివాదాలు, ఆందోళనల నేపధ్యంలో ఆమె ఇందుకు నిరాకరించినట్లు తెలిపారు. 
 
పద్మావతి చిత్రంలో రాజపుత్రులకు సంబంధించిన చరిత్రను వక్రీకరించారంటూ ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. భాజపాకు కుడిభుజంగా వుండే కొందరు నాయకులు పద్మావతి చిత్రంలో నటించిన దీపికతోపాటు ఆ చిత్ర దర్శకుడిని చంపితే రివార్డులు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. 
 
అఖిల భారత క్షత్రియ మహాసభ అయితే దీపికా పదుకునెను బతికుండగానే తగులబెడితే రూ. 1 కోటి ఇస్తామంటూ తీవ్రమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆగ్రహంతో దీపికా పదుకునె వున్నట్లు చెప్పుకుంటున్నారు. అసలు కారణం ఏదైతేనేం... దీపికా పదుకునె మాత్రం ఇవాంకా ట్రంప్ సమావేశానికి డుమ్మా కొట్టేయాలని నిర్ణయించుకుంది.