శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వాసు
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:33 IST)

'మిస్టర్ మజ్ను' కంటే 'జబర్దస్త్ ఆది'కే ఎక్కువ... ఏంటది?

అసలే నేటివిటీ కనబడని ఫేస్‌తో 'మన్మథుడు' అక్కినేని నాగార్జున కుమారుడు అనే ఒకే ఒక్క బ్రాండ్ స్టాంప్‌తో తెరంగేట్రం చేసిన అక్కినేని మూడో తరం యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని. తొలి సినిమా విడుదలై పరాజయం పొందడంతో కుంగిపోయి బైటకు రాలేదట. ఇక రెండో సినిమా హలోకి కాస్తంత ప్రచారం చేసినప్పటికీ అది కూడా పనిచేయకపోవడంతో ముచ్చటగా మూడో సినిమా మిస్టర్ మజ్నుకి నెగెటివ్ టాక్ వచ్చేసినా టూర్ ప్లాన్ చేసేసి దేవాలయాలలో మొక్కుబడులు చెల్లించేసుకుంటూ, సినిమా హాళ్లల్లో ప్రేక్షకుల్ని కలిసేస్తూ తెగ సందడి చేసేస్తున్నాడు. 
 
అయితే ఈ యువ హీరో సినిమాలో అమ్మాయిల్ని ఆకర్షించినంత గొప్పగా.. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించలేకపోతున్నాడనేది బాహాటంగానే చర్చించుకుంటున్న విషయం. అక్కినేని ఫ్యామిలీకి అంటూ ఉండే ఫ్యాన్స్‌కి తను కూడా నచ్చేలా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ యువహీరో వారిలో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల తిరుమల వెళ్లిన మిస్టర్ మజ్ను టీమ్, బుధవారం విజయవాడలోనూ సందడి చేసింది. 
 
సినిమా విడుదలకు ముందు ఇతర పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు వెంకీ కూడా రిలీజైన తర్వాత ప్రమోషన్‌పై పూర్తి ఫోకస్‌ని పెట్టాడు. హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత.. అందరూ సినిమా హిట్ కోసం చెమటోడుస్తున్నారు. ఇలా వీక్ టాక్‌తో కుంగిపోకుండా కనీసం విజయయాత్ర చేసైనా అభిమానుల్లో ఆనందం నింపాలనుకుంటున్నాడు అఖిల్.
 
మూడో సినిమాకే ఈ యువ హీరోకి జ్ఞానోదయమైనప్పటికీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే కొసమెరుపు ఏమిటంటే.. ఈ విజయ యాత్రలో హీరో అఖిల్ కంటే జబర్దస్త్ నటుడు ఆదికే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది అనేది ప్రత్యక్ష సాక్షులు గుసగుసలాడుకుంటున్నారు. విజయవాడ ప్రోగ్రామ్‌లో కూడా అఖిల్ కంటే ఆదితో ఫొటోలు తీసుకునేందుకే జనాలు ఎగబడ్డట్లు వినికిడి.