మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (10:34 IST)

రేప్ చేసి చంపేస్తారని భయపడిపోయా.. అమీషా పటేల్

బీహార్ రాష్ట్ర శాసనసభకు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ బుధవారం జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీల్లో లోక్‌ జనశక్తి పార్టీ ఒకటి. ఈ పార్టీ టిక్కెట్‌పై ప్రకాష్ చంద్ర అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా ప్రచారం చేయడానికి బాలీవుడ్ నటి అమీషా పటేల్ బీహార్‌కు వెళ్లింది. ఈ ఎన్నికల ప్రచార సమయంలో తనకు జరిగిన భయంకరమైన సంఘటనను ఒకటి తాజాగా చెప్పుకొచ్చింది. 
 
దీనిపై అమీషా పటేల్ స్పందిస్తూ, దౌద్ నగర్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు తనను బహుశా రేప్ చేసి, హతమార్చి ఉండేవారేమో అని ముంబై చేరుకున్న ఆమె వెల్లడించింది. 'నన్ను నేను రక్షించుకునేందుకు ఆ నియోజకవర్గం నుంచి, ఆ రాష్ట్రం నుంచి వేగంగా బయటపడ్డాను' అని అమీషా పేర్కొంది. 
 
ప్రకాష్ చంద్ర తనను బ్లాక్ మెయిల్ చేశాడని, బెదిరించడమేగాక, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అదొక పీడకల అని ఆమె అభివర్ణించింది. ముంబై వచ్చాక కూడా అతడు తనను బెదిరిస్తూ కాల్స్ చేశాడని, తన గురించి గొప్పగా చెప్పాలని ఒత్తిడి చేశాడని అమీషా పటేల్ వాపోయింది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ ప్రకాష్ చంద్ర తొసిపుచ్చాడు.