శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (13:28 IST)

మీ పేరున్న ఆంజనేయస్వామి చల్లగా ఉంచాలనీ... కన్నీరు పెట్టిన విలన్

మెగాస్టార్ చిరంజీవి మరోమారు దాతృత్వం చేశారు. ఓ విలన్ నటుడికి ప్రాణదానం చేశారు. అనేక చిత్రాల్లో చిరంజీవితో కలిసి విలన్ పాత్రల్లో నటించిన నటుడు పొన్నాంబళం. తమిళ నటుడు. ఈయనకు ఇటీవల కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అయితే, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవసరమైన నగదును చిరంజీవి ఇచ్చారు. 
 
తన ఆరోగ్యం కుదుటపడటం కోసం చిరంజీవి నుంచి సాయం అందిందని తెలియగానే పొన్నాంబళం ఫోన్ ద్వారా తన కృతజ్ఞతలు తెలిపారు. 'చిరంజీవి అన్నయ్యకు నమస్కారం, చాలా ధన్యవాదాలు అన్నయ్యా… నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరున్న ఆ దేవుడు ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటూ… జై శ్రీరామ్‌' అంటూ తన సందేశాన్ని తమిళంలో వీడియో రూపంలో పంపారు పొన్నాంబళం.
 
కాగా, తన సినిమాల్లో విలన్‌గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే చిరంజీవి స్పందించారు. ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్స కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం బదిలీ చేశారు. 
 
మెగాస్టార్ చిరంజీవి తనకు రెండు లక్షల రూపాయలు సహాయం చేశారని తెలుసుకున్న పొన్నాంబళం చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు తదితర చిత్రాల్లో పొన్నాంబళం నటించారు. ప్రస్తుతం ఈయన చెన్నైలో ఉంటున్నారు.