ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (18:19 IST)

పాన్‌మసాలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తప్పుకున్న బిగ్ బి

బిగ్ బి... అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ ఈరోజు తన 79వ పుట్టినరోజును జరుపుకున్నారు. నాలుగు దశాబ్దాల తిరుగులేని సినిమా ప్రస్థానంలో వందలకొద్దీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

అందులో ఎన్నో బాక్సాఫీసు విజయాలను అందుకున్నారు. తన నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాంతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు.. ఇలా చెప్పుకొంటూపోతే అమితాబ్ బచ్చన్ జీవితం మహా గ్రంథం. అందులో ప్రతి పేజీ విలువైందే. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు పలు ప్రకటనల కూడా చేస్తూ వున్నారు. 
 
అయితే తాజాగా పాన్‌మసాలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు అమితాబ్‌ బచ్చన్‌ ప్రకటించారు. బ్రాండ్‌ ప్రమోషన్‌కు కంపెనీ ఇచ్చిన పైకాన్ని వెనక్కు ఇచ్చినట్లు తెలిపారు. పాన్‌మసాలా ప్రకటనలో నటించడానికి ఒప్పుకోవడంతో అమితాబ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభిమానులు తమ స్టార్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బచ్చన్‌ వెనక్కు తగ్గారు. ఈ మేరకు ఒక బ్లాగ్‌లో ఆఫీస్‌ ఆఫ్‌ అమితాబ్‌ బచ్చన్‌ పేరిట ఒక పోస్టు కనిపించింది. 
 
గతవారం బచ్చన్‌ ఈ ప్రకటన నుంచి తప్పుకున్నారని, ప్రచారానికి ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోకపోవడం వల్ల అంగీకరించినట్లు పోస్టులో తెలిపారు.  పాన్‌ మసాలా బ్రాండ్లకు ప్రకటనకర్తగా వ్యవహరించవద్దని ఇటీవల ఎన్‌ఓటీఈ అనే పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్‌కు విజ్ఞప్తి చేసింది.