గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (13:30 IST)

యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న "డర్టీ హరి" పోస్టర్లు.. నిర్మాతపై కేసు

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడుగా మారి తెరకెక్కించిన చిత్రం "డర్టీ హరి". రుహానీ శర్మ, శ్రవణ్ రెడ్డి, సిమత్ర కౌర్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా బోల్డ్ కంటెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని.. ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు.
 
అయితే, గత కొద్ది రోజులుగా ఈ చిత్రం పోస్టర్లు రచ్చరచ్చ చేస్తున్నాయి. యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన వాల్‌పోస్టర్లలో శృంగారం మోతాదుకు మించి వున్నట్టు కనిపిస్తోంది. దీంతో నిర్మాతపై హైదరాబాద్ నగరంలో ఓ కేసు నమోదైంది. 
 
హైదరాబాద్ నగరంలోని వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్‌పై అతికించిన సినీ పోస్టర్లకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా... యువతను తప్పుదోవ పట్టించే రీతిలో డర్టీ హరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని సినీ నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై సుమోటో కేసు నమోదు చేశారు.