సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (10:02 IST)

తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ - నవరస నటనా సార్వభౌముడు : చిరంజీవి

chiranjeevi kaikala
టాలీవుడ్ లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపై మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు ఆయన కైకాలతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఒక సుధీర్ఘ ప్రకటన విడుదల చేశారు. అందులో... 
 
"శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యనారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యనారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు.
 
శ్రీ కైకాల సత్యనారాయణ గారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి. 
 
ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను 'తమ్ముడూ' అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
chiranjeevi kaikala
 
నటన, రుచికరమైన భోజనం రెండూ శ్రీ కైకాల సత్యన్నారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. 
 
ఆ సందర్భంగా సత్యన్నారాయణ గారు సురేఖతో "అమ్మా ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు “మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడిపోయారు.
 
శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను".
 
-- కె. చిరంజీవి