మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (10:41 IST)

అన్ని మాటలు అనేందుకు నీకు మనసు ఎలా వచ్చింది శాంతి? మెగాస్టార్

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం సరిలేకు నీకెవ్వరు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించనున్నారు. అదీ కూడా దశాబ్దన్నర కాలం తర్వాత ఆమె వెడితెరపై కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
ఇందులో తన హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 'సండే అననురా మండే అననురా ఎన్నడూ నీదాన్నిరా'.. అంటూ మాట ఇచ్చి నా మనిషిగా నా హీరోయిన్‌గా ఉండకుండా పదిహేనేళ్ల తర్వాత ఇప్పటికి కనిపించింది. విజయశాంతితో హీరోయిన్‌గా కంటే వ్యక్తిగతంగా కుటుంబ అనుబంధం ఎక్కువగా ఉంది. మద్రాస్ టీ నగర్‌లో మా ఇంటి ఎదురుగానే విజయశాంతి కూడా ఉండేది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా హాజరవుతూ సొంతమనుషుల్లా మెలిగేవాళ్లం" అని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాదు, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తనను విజయశాంతి విమర్శించిన వైనాన్ని చిరంజీవి సరదాగా ఓ స్కిట్ రూపంలో ప్రదర్శించారు. "నాకంటే ముందు రాజకీయాల్లోకి వెళ్లావు కదా, నన్ను అన్ని మాటలు అనాలని నీకెందుకనిపించింది?" శాంతి అంటూ కొంటెగా అడిగారు. నేను ఎన్నడైనా ఒక్క మాట అన్నానా అంటూ చిన్నపిల్లాడిలా ప్రశ్నించాడు. 
 
దానికి విజయశాంతి.. చిరంజీవి చేతిని పట్టుకుని స్పందిస్తూ, "చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా జాగ్రత్త" అంటూ నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత మాట్లాడుతూ, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంటూ విజయశాంతి భావోద్వేగానికి లోనయ్యారు.
 
ఈ సందర్భంగా చిరంజీవి తాను విజయశాంతితో నటించిన సినిమాల పాటలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత వచ్చినా నీలో అదే పొగరు, అదే విగరూ శాంతి.. ఏం తగ్గలేదు, చూస్తుంటే ఇక్కడుండాల్సిన గుండె ఇక్కడకి వస్తోంది అంటూ చమత్కరించారు. రాజకీయాలు మనుషుల మధ్య శత్రుత్వాలను పెంచితే, సినిమా రంగం మాత్రమే స్నేహాన్ని పంచుతుందని వ్యాఖ్యానించారు.