శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (19:11 IST)

చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్.. దర్శకుడు ఖరారు!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో తన సత్తాను చాటుతున్నాడు. 'ఖైదీ నంబర్ 150'తో దశాబ్దకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి... ఇటీవల "సైరా నరసింహా రెడ్డి" చిత్రంతో హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రూ.250 కోట్ల భారీ బడ్జెట్ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం... అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
"సైరా" తర్వాత చిరంజీవి నటించే 152వ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇపుడు 153వ చిత్రంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన "లూసిఫర్" చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం హక్కులను హీరో రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న అంశంపై ఫిల్మ్ నగర్‌లో చర్చ సాగింది. ఈ ఊహాగానాలకు ఇపుడు తెరపడింది. 'లూసిఫర్' రీమేక్‌కి దర్శకుడిగా లెక్కల మాస్టారు సుకుమార్ పేరు వినిపిస్తోంది. 'రంగస్థలం' బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో సుకుమార్‌కి సాన్నిహిత్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. 
 
పైగా, రామ్ చరణ్ సెంటిమెంట్ ప్రకారం సుకుమార్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చెర్రీతో "ధృవ" చిత్రానికి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి సైరా నరసింహా రెడ్డికి దర్శకత్వం వహించారు. అలాగే, 'రంగస్థలం' వంటి హిట్ చిత్రం తర్వాత సుకుమార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.