సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (15:03 IST)

రా అండ్ రస్టిక్‌గా సతీష్ బాబు నటిసున్న జాతర ఫస్ట్ లుక్ పోస్టర్

Jatara look poster
Jatara look poster
ప్రస్తుతం హీరోలు దర్శకులు అవుతున్నారు.. దర్శకులు హీరోలు అవుతున్నారు.. కొంత మంది మల్టీటాలెంట్ చూపిస్తూ కథను రాసుకుని దర్శకత్వం వహిస్తూ హీరోలుగా నటిస్తున్నారు. అసలే ఇప్పుడు అంతా కూడా కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలంటూ కొత్త కథల వెంట పడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. సతీష్ బాబు ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘జాతర’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.
 
‘జాతర’ చిత్రానికి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగానూ నటించారు సతీష్ బాబు. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టేశారు.
 
ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే సతీష్ బాబు ఈ చిత్రంలో ఎంత రా అండ్ రస్టిక్‌గా కనిపించబోతున్నారో అర్థం అవుతోంది. శత్రువుల్ని వదించేందుకు కత్తి పట్టుకుని ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక అమ్మవారి ఫోటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్, లుక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ‘దేవుడు ఆడే జగన్నాటకంలో.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం’ అంటూ పోస్టర్ మీద రాసి ఉన్న డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.
 
చిత్తూరు జిల్లాలో జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పాలేటి గంగమ్మ దేవత బ్యాక్ డ్రాప్‌గా కథను అల్లుకున్నారు. ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు.
 
తారాగణం: సతీష్ బాబు, దీయా రాజ్, ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్