1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (18:32 IST)

తోటివారితో వ‌ర్క్‌షాప్‌లో పాల్గొన్న హరిహర వీర మల్లు

Pawan Kalyan, Krish Jagarlamudi, Keeravani
Pawan Kalyan, Krish Jagarlamudi, Keeravani
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన తెలుగు సినిమాకి అందించారు. అద్భుతమైన దర్శకుడు, రచయిత అయినటువంటి ఆయన పవన్ కళ్యాణ్‌ కథానాయకుడిగా 'హరిహర వీర మల్లు' అనే చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
 
pawan kalyan with his team
pawan kalyan with his team
సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి సాధ్యంకాని విధంగా అసాధారణమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఆయన ఇలాంటి భారీ స్థాయి పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. తన అభిమానులతో పాటు తెలుగు మరియు భారతీయ సినీ ప్రేమికుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాన్ని అందించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
 
వెండితెరపై అద్భుతం సృష్టించడం కోసం చిత్ర బృందం శక్తికి మించి కష్టపడుతోంది. చిత్రీకరణ నుండి కొంత విరామం తర్వాత రాబోయే షెడ్యూల్‌లో పాల్గొనే ప్రధాన నటీనటులు మరియు కొంతమంది ముఖ్యమైన సాంకేతిక నిపుణలతో ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వర్క్‌షాప్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ప్రేక్షకులకు ఓ పరిపూర్ణమైన చిత్రాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ వర్క్‌షాప్ తలపెట్టారు. దసరా నవరాత్రులు సందర్భంగా ఈ రోజు ఉదయం వేకువ ఝామున సరస్వతి అమ్మవారికి పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం చిత్ర బృందం ఈ వర్క్ షాప్ కు సమాయుత్త మైంది. 
 
ఈ వర్క్‌షాప్ గురించి పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ చర్చించారు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. షూటింగ్ కి వెళ్లే ముందు తాను మరియు తన తోటి నటీనటులు పాత్రల గురించి మరింత అవగాహన పొందేందుకు మరియు స్క్రిప్ట్ గురించి బాగా చర్చించుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వర్క్‌షాప్‌కు వెంటనే అంగీకరించారు. దర్శకుడు క్రిష్ మరియు పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వెండితెర అనుభూతిని అందించడానికి ఈ స్థాయిలో కష్టపడుతున్నారు.
 
ఈ ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, రచయిత-హాస్యనటుడు హైపర్ ఆది, వారితో పాటు చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం, నిర్మాత ఎ దయాకర్ రావు, సంగీత దర్శకులు కీరవాణి , ఛాయా గ్రాహకుడు వి. ఎస్. జ్ఞాన శేఖర్, విజయ్, చింతకింది శ్రీనివాసరావు    మరియు ఇతర ముఖ్యమైన సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. వర్క్‌షాప్ ముగిశాక అక్టోబర్ రెండో వారం తర్వాత నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
 
మెగా సూర్య ప్రొడక్షన్స్ లో ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'ఖుషి' వంటి ఆల్ టైం క్లాసిక్ హిట్ , మరియు ‘బంగారం‘ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్‌తో ఎ.ఎం. రత్నం చేస్తున్న చిత్రమిది. లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తొలిసారిగా పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.