శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (13:34 IST)

నాకు ఎంతో సిగ్గు చేటుగా ఉంది : అనసూయ భరద్వాజ్

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj
‘రజాకార్ సినిమాలో నేను సగటు మహిళగా నటించాను. మా డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు.. ఈ చరిత్ర అంతా కూడా మన పుస్తకాల్లో ఎందుకు పెట్టలేదు అని అడిగాను. ఇంటికి వెళ్లి మా అమ్మ, తాత గార్లను అడిగాను. వినోబాబావే గారితో మా తాత గారు కూడా భూదానం చేశారు. ఇది కథ కాదు. జీవితం అని తెలిసిందే. ఇది అవగాహన కల్పించే చిత్రం అని అనసూయ భరద్వాజ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ, ఇది జరిగిన చరిత్ర. నేను ఉన్న ఈ ప్రాంతంలో ఇంత జరిగిందా? అని నాకు తెలియదు. ఇంత జరిగిందా? అని తెలుసుకుని ఈ సినిమాను చేశాను. నిజం చెప్పేందుకే ఈ సినిమాను తీశారు. ఇది కల్పిత కథ కాదు. ఇంత జరిగిందా? అని నేను తెలుసుకోలేకపోయాను. నాకు ఎంతో సిగ్గు చేటుగా ఉంది. ఇలాంటి ఓ సినిమా వస్తోందని, అందులో ఓ పాటను చేశాను అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అసలు అలాంటి అమానవీయ ఘటనలు జరగకుండా ఉండాల్సింది.కానీ జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాల్సి బాధ్యత మన మీద ఉంది. నా వంతుగా ఈ సినిమాలో భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. మన చరిత్రను తెరపైకి తీసుకొస్తున్న దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
 
మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. ‘ఎన్నో కష్టాలు పడి సినిమా తీసిన రజాకార్ టీంకు ఆల్ ది బెస్ట్. దేశమంతా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. మనం కూడా సెలెబ్రేట్ చేసుకుంటాం. కానీ మనకు ఆ రోజు స్వాతంత్ర్యం రాలేదని చాలా మందికి తెలియదు. సెప్టెంబర్ 17, 1948న స్వాతంత్ర్యం వచ్చిందని చాలా కొద్దిమందికే తెలుసు. కానీ ఆ రోజుని మనం ఇంత వరకు అధికారికంగా జరుపుకోలేకపోవడం మన దురదృష్టకరం. అలాంటి రజాకర్ చరిత్రను చూపించేందుకు సినిమా తీశారు. భారతీ భారతీ ఉయ్యాలో పాటలో చిన్న గ్లింప్స్ చూస్తేనే అందరూ వణికిపోతోన్నారు. సినిమా వస్తే రజాకార్ చరిత్ర అందరికీ తెలుస్తుంది. ఇంత మంచి ప్రయత్నం చేస్తున్న ఈ టీంకు భగవంతుని ఆశీస్సులు ఉండాలి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.