సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:18 IST)

రాజా విక్రమార్క బయటకొస్తే ప్రమాదమే పరారు

Karthikeya Gummakonda
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్న సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ఈ రోజు (సెప్టెంబర్ 21) కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో థీమ్ సాంగ్ విడుదల చేశారు.
 
రాజా గారు బయటకొస్తే ప్రమాదమే పరారు, అంతే రాజా గారు వేటకొస్తే  భుజాలపై షికారులే ఖరారు అంతే.. అనే పల్లవితో థీమ్ సాంగ్ సాగింది. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించగా లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ గీతాన్ని రాశారు. 'అత్తారింటికి దారేది'లో 'ఇట్స్ టైమ్ టు పార్టీ', 'భరత్ అనే నేను' టైటిల్ సాంగ్‌తో పాటు 'ఎఫ్ 2'లో 'రెచ్చిపోదాం బ్రదర్', 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో వయోలిన్ సాంగ్, 'నేను శైలజ'లో 'ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్' వంటి హిట్ సాంగ్స్ పాడిన డేవిడ్ సైమన్ ఈ పాటను పాడారు.
 
నిర్మాత '88' రామారెడ్డి మాట్లాడుతూ "మా హీరో కార్తికేయగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు కానుకగా 'రాజా విక్రమార్క'లో 'రాజా గారు...' థీమ్ సాంగ్ రిలీజ్ చేశాం. సెకండాఫ్‌లో కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ తదితర ముఖ్య తారాగణంపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పాటను చిత్రీకరించాం. సినిమా చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. నాలుగు పాటలకు వేటికవే భిన్నమైన బాణీలను ప్రశాంత్ ఆర్. విహారి అందించాడు. మా దర్శకుడికి తొలి చిత్రమైనా అద్భుతంగా తెరకెక్కించాడు. కార్తికేయ నటన సినిమాకు హైలైట్ అవుతుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని అన్నారు.
 
కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.