1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (17:42 IST)

తెలుగు వారికి ఛాన్సులు త‌క్కువంటే న‌మ్మ‌ను - శోభితా ధూళిపాళ్ల

Shobhita Dhulipalla
నేను నా సినీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఇలాంటి సినిమాలే చేయాలి, అలాంటి పాత్రలు చేయకూడదని చాలా పర్టికులర్‌గా ఉండేదాన్ని. అయితే నేను సినిమా చేస్తున్న క్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నా. ఏ జోనర్ సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చేలా కథ ఉంటే అందులో నటించాలని అనుకున్నా. ఇప్పుడు అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నా. కురుప్ కూడా అలాంటిదే` అని హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల తెలియ‌జేశారు.
 
దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించింది. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేస్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్ర‌వార‌మే విడుద‌లైన ఈ సినిమా గురించి ఆమె చెప్పిన విశేషాలు.
 
- నేను పుట్టి పెరిగింది సంప్రాదయమైన తెలుగు కుటుంబంలో అయినా, నా సినీ ప్రస్థానం మొదలైంది మాత్రం ముంబైలోనే. కాబట్టి నా జర్నీకి స్టార్టింగ్ పాయింట్ బాలీవుడ్ అని చెప్పొచ్చు. నా మనసులో ఎలాంటి బౌండరీలు లేవు. నేను ఏ భాషలో సినిమా చేయాలన్నా కథ బాగా నచ్చాలి. అంతేకానీ ఇది మన భాష కాదనే విషయాన్ని నేను పట్టించుకోను. సినిమాలో నా పాత్ర నన్ను ఇంప్రెస్ చేస్తే ఏ భాషలో అయినా చేసేందుకు నేను రెడీ. ‘కురుప్’లో నా పాత్ర నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.
 
- తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, బయటి నుంచి వచ్చేవాళ్లకే ఛాన్సులు ఇస్తారనే మాటను నేను నమ్మను. తెలుగులో ఇతర భాషల హీరోయిన్లు వస్తున్న మాట నిజమే. కానీ తెలుగువాళ్లకు అవకాశాలు లేవని నేను చెప్పను. నాకు బయటకంటే ఇక్కడే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు కూడా మనలాగే అనుకుంటారేమో.
 
‘కురుప్’, ‘మేజర్’ సినిమాల తర్వాత మణితర్నం గారితో ‘పొన్నియన్ సెల్వణ్’ మూవీ చేస్తున్నా. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. ‘సితార’ అనే హిందీ సినిమాతో పాటు ‘మేడిన్ హెవన్’ సీజన్2లో కూడా చేస్తున్నా. ఇక నా తొలి హాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాను. నేను నటించిన పలు సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటి కోసం ఎదురు చూస్తున్నా.