శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2024 (12:15 IST)

'దేవర'తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ - జోరు చూపలేకపోయిన శ్రీదేవి తనయ

jhanvi kapoor
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో ఆశించిన స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఈ యేడాది జూనియర్ ఎన్టీఆర్ నటించిన "దేవర" చిత్రంతో ఆమె తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అందరూ భావించారు. అయితే, ఆమె పాత్రకు దర్శకుడు గ్లామర్ టచ్ తక్కువగా ఉంది. దీంతో ఆమె ప్రేక్షకులను ప్రభావితం చేయలేక పోయింది. ఫలితంగా టాలీవుడ్‌లో ఆమె ఆశించిన స్థాయిలో జోరుచూపలేకపోయింది. 
 
నిజానికి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయినప్పటికీ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడానికి కూడా చాలా సమయం వేచి చూసింది. ఆమె కోసం సరైన కథను ఎంపిక చేసుకోవడంలోనే ఆలస్యం జరుగుతూ వెళ్లింది. ఇంత చేసినా ఆమె ఆశించిన స్థాయిలో అక్కడ విజయాలను నమోదు చేయలేకపోయింది.
 
ఇక శ్రీదేవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం. అందువలన ఆమె కూతురైన జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందా అని వాళ్లంతా ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. టాలీవుడ్ ఎంట్రీ కూడా అనుకున్నంత తేలికగా ఏమీ ఇవ్వలేదు. మొత్తానికి ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో ఈ ఏడాది జాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'దేవర' సినిమాతో ఆమె ఇక్కడ బిజీ కావడం ఖాయమనే ప్రచారం, ఈ సినిమా రిలీజ్ కి ముందే జోరుగా జరిగింది.
 
'దేవర' సినిమాకి జాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనే అంతా అనుకున్నారు. అయితే ఆశించినస్థాయిలో జాన్వీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా అందుకు కారణమనే టాక్ వినిపించింది. లవ్.. రొమాన్స్ పాళ్లు తక్కువగా ఉండటం, డ్యూయెట్స్‌కి ఎక్కువగా అవకాశం లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పుకున్నారు. ఒక మంచి కాంబినేషన్ చూసుకుని సెట్ చేసుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయింది. మరి దేవర రెండో భాగంలో ఆమె పాత్ర జోరు ఎలా ఉంటుందో చూడాలి మరి.